

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : దేశీయ బొగ్గు ఉత్పత్తి రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న సింగరేణి సంస్థ, ఇప్పుడు ఖనిజాల అన్వేషణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగేందుకు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అమెరికా సంస్థలతో సాంకేతిక, వ్యాపార భాగస్వామ్యాలకు సిద్ధమవుతోంది. పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్లు, డేటా సెంటర్ల ఏర్పాటు వరకు పలు అంశాలపై అమెరికా కాన్సులేట్ ప్రతినిధి బృందంతో సింగరేణి ఉన్నతాధికారులు చర్చలు జరిపారు.
హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో శుక్రవారం సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతితో అమెరికన్ కాన్సులేట్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ చీఫ్ మెరెడిత్ మెజ్లర్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం సమావేశమైంది. ఖనిజరంగంలో అమెరికా సంస్థలతో కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాల గురించి చర్చించారు. మైనింగ్ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన సింగరేణి సంస్థ ఇప్పటికే కీలక ఖనిజాల రంగంలోకి ప్రవేశించిందని సీఎండీ వివరించారు. ఈ రంగంలో అంతర్జాతీయ సంస్థలతో సాంకేతిక సహకారం, ఉమ్మడి భాగస్వామ్యాల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన జియో సైన్స్ లాబొరేటరీలోని పరిశోధన సౌకర్యాలు, ఓపెన్‌కాస్ట్ గనుల ఓవర్బర్డెన్లో లభించే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌పై అమెరికా ప్రతినిధులు ప్రత్యేక ఆసక్తి కనబరిచారు.
పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లపై ప్రత్యేక చర్చ
మూతపడిన ఓపెన్‌కాస్ట్ గనులను నిరుపయోగంగా వదిలేయకుండా వాటిని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుగా మార్చేందుకు సింగరేణి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా పలు ప్రాంతాల్లో పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించింది. డేటా సెంటర్లకు అత్యధిక విద్యుత్ అవసరమయ్యే పీక్ అవర్స్‌లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ఈ ప్లాంట్లు ఉపయోగపడతాయని అధికారులు వివరించారు. తగిన పెట్టుబడులు, భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టులను చేపట్టే అవకాశాలున్నాయని తెలిపారు. సమీపంలోని గోదావరి నది నుంచి నీటిని వినియోగించుకునే వెసులుబాటు కూడా ఉందని పేర్కొన్నారు.
డేటా సెంటర్ల ఏర్పాటుకు ఆసక్తి
ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో డేటా సెంటర్లకు డిమాండ్ పెరుగుతోందని అమెరికా ప్రతినిధులు అన్నారు. తెలంగాణలో సింగరేణి పరిధిలో కూడా డేటా సెంటర్ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను పరిశీలించేందుకు ఆసక్తి చూపించారు. అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు ఈ రంగం అభివృద్ధికి అనుకూలంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
బదిలీ వర్కర్ల క్రమబద్ధీకరణ
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న బదిలీ వర్కర్లను క్రమబద్ధీకరించారు. ఈ మేరకు సంగరేణి యాజమాన్యం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన కోల్‌బెల్ట్ ప్రజాప్రతినిధుల సమావేశంలో డిప్యూటీ సీఎం ఈ మేరకు హమీ ఇచ్చారు. దీంతో దాదాపు 1,135 మంది కార్మికులను జనరల్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరణ చేయనున్నారు. 2025 డిసెంబర్ 31వ తేదీ కన్నా ముందు ఉద్యోగంలో చేరిన వారికి ఇది వర్తిస్తుంది. ఆయా ప్రాంతాలలో పనిచేస్తున్న అర్హుల జాబితాలను 23వ తేదీలోగా అందజేయాలని ఏరియా జీఎంలను యాజమాన్యం కోరింది. ఆ జాబితాలను అనుసరించి ఉద్యోగులను 2026 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి క్రమబద్ధీకరిస్తారు.