‘ఉపాధి’తో కరువును జయిద్దాం : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఉపాధి హామీ పథకంతో చెరువులు, కాల్వలను పునరుద్ధరించనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. జనవరి నుంచి జూన్ వరకు పనులు జరగనున్నాయి.
‘ఉపాధి’తో కరువును జయిద్దాం : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తున్నదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకొని చెరువులు, కుంటలు, వాగులు, కాల్వలను పునరుద్ధరించబోతున్నామని చెప్పారు. తద్వారా భూగర్భ జలవనరులు పెంచుకుందామన్నారు. ఈ పనుల్లో గ్రామస్తులు, వ్యవసాయ కూలీలను భాగస్వాములను చేస్తామని తెలిపారు. గురువారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్ అధికారులతో సమావేశం నిర్వహించి ఈ మేరకు సూచనలు చేశారు. రాబోయే వర్షాకాలం కంటే ముందు ఆరు నెలలపాటు భారీ కార్యక్రమం చేపడతామన్నారు. గ్రామీణ ఉపాధి కల్పనతోపాటు భూగర్భ జలాల లభ్యతను మెరుగుపరిచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

355 రకాల పనులు

వచ్చే ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 355 రకాల పనులను చేపట్టబోతున్నామని చెప్పారు. నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి, భూగర్భజల, విద్యుత్‌ తదితర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఉపాధి హామీ పనుల్లో ప్రస్తుతం 60:40 నిధుల నిష్పత్తి అమలవుతున్నదని.. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులకు అదనంగా నిధులు ఇస్తుందని చెప్పారు. గ్రామాల్లోని కుంటలు, చెరువులకు నీరు చేర్చే కాల్వలు, సాగునీటి ప్రాజెక్టుల కాల్వలను మరమ్మతు చేసుకుందామన్నారు. దెబ్బతిన్న తూములు, గేట్ల మరమ్మతుల చేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు.

వర్షం నీటిని ఒడిసిపడదాం
వర్షం నీటిని ఒడిసిపట్టి భూగర్భజలాల పునరుద్ధరణకు దోహదపడేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ సూచించారు. రాజస్థాన్‌, మహారాష్ట్రల్లో చేసిన పనులను అధ్యయనం చేసి తెలంగాణకు అనుకూల విధానాలను అవలంబించాలని మంత్రి అధికారులను కోరారు. ఈ కార్యక్రమానికి ఆకర్షణీయమైన పేరు సూచించాలని అధికారులను కోరారు. సమావేశంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, ప్రభుత్వ నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాథ్‌ దాస్‌ తదితరులు పాల్గొన్నారు.