

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : ప్రాజెక్టుల సాగునీటి లక్ష్యాలకు భంగం కలగకుండా పర్యావరణ ప్రభావాన్ని తగ్గించే ఇంజినీరింగ్ మార్పులను పరిశీలించాలని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర వ్యక్తం చేస్తున్న ముంపు, పర్యావరణ సంబంధిత ఆందోళనలకు ఆచరణాత్మకమైన పరిష్కారాలు రూపొందించాలన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఇటీవల జరిగిన చర్చలకు కొనసాగింపుగా శనివారం తుమ్మిడిహట్టి బ్యారేజీ సాంకేతిక అంశాలు, ప్రతిపాదిత అలైన్‌మెంట్లపై మంత్రి ఉత్తమ్ తన క్యాంప్ కార్యాలయంలో రివ్యూ నిర్వహించారు. వివిధ జలాశయ నీటిమట్టాల వద్ద ప్రభావితమయ్యే భూముల విస్తీర్ణాన్ని సమగ్రంగా అంచనా వేయాలన్నారు. వాస్తవంగా ఎంతమేర ముంపు ఏర్పడుతుందో నిర్ధారించేందుకు స్పష్టమైన మ్యాప్‌లను సిద్ధం చేయాలని ఆదేశించారు. నదీగర్భ ప్రాంతాలు, అటవీ భూములు, పర్యావరణ సున్నిత మండలాలు, సంరక్షిత కోర్ ప్రాంతాలు, రెవెన్యూ భూములు, జనావాసాలను స్పష్టంగా గుర్తించేలా మ్యాప్‌లను రూపొందించాలని స్పష్టం చేశారు. సుందిళ్ల బ్యారేజీ, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా 77 టీఎంసీల నీటిని మళ్లించి, ఏడు జిల్లాల పరిధిలోని 5.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్, ఇంజినీర్ ఇన్ చీఫ్ (జనరల్) ఓవీ రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.