బియ్యం ధరలు పెంచితే ఊరుకోం .. రైస్‌మిల్లర్లకు మంత్రి ఉత్తమ్ వార్నింగ్

బియ్యం అక్రమ నిల్వలు, అధిక ధరల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హెచ్చరించారు. బీపీటీ బియ్యం కిలో ధర రూ.66 మించొద్దు అన్నారు.
Uttam Kumar Reddy reviewing rice price control measures
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసినా, బ్లాక్‌మార్కెట్‌కు తరలించినా, అధిక ధరలకు విక్రయించి ప్రజలపై భారం మోపినా కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హెచ్చరించారు. వినియోగదారుల అవసరాలను ఆసరాగా చేసుకుని దోపిడి చేస్తున్నవారిని ప్రభుత్వం ఉపేక్షించబోదన్నారు. బియ్యం ధరల నియంత్రణ గురించి తీసుకుంటున్న చర్యలపై బేగంపేట కుందన్ బాగ్‌లోని తన క్యాంపు కార్యాలయంలో పౌర సరఫరాల శాఖాధికారులతో మంత్రి  శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పెరుగుతున్న బియ్యం ధరలను అదుపులోకి తీసుకొచ్చి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలను ముమ్మరం చేసినట్లు తెలిపారు.

బీపీటీ బియ్యం కిలో రూ. 66

టోకు, చిల్లర వ్యాపారులు, రైస్‌మిల్లర్లతో పౌర సరఫరాల శాఖ అధికారులు జరిపిన చర్చల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. అక్రమాల నిరోధానికి చేపట్టిన ప్రత్యేక చర్యలు, తనిఖీల పురోగతిని పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర మంత్రికి వివరించారు. సాధారణంగా ప్రజలు ఎక్కువగా వినియోగించే బీపీటీ బియ్యం ధర కిలో రూ.66 కు మించకుండా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలు తదితర అవకతవకల ఆరోపణలపై ఇప్పటికే బియ్యం వ్యాపారులపై 12 కేసులు నమోదు చేసినట్లు, ఐదు శాఖల సమన్వయంతో దాడులు నిర్వహిస్తున్నామన్నారు. పౌర సరఫరాలు, పోలీసు, జీఎస్టీ, తూనికలు–కొలతల శాఖలతోపాటు సంబంధిత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలు ఈ చర్యల్లో పాల్గొంటున్నాయని వివరించారు.

సరిపడా బియ్యం నిల్వలు

రాష్ట్రంలో ప్రజల అవసరాలకు సరిపడా బియ్యం నిల్వలు ఉన్నాయని మంత్రి భరోసా ఇచ్చారు. కొరత వస్తుందనే ఆందోళనతో అవసరానికి మించి బియ్యం కొనుగోలు చేసి నిల్వ చేసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిబంధనలకు అనుగుణంగా వ్యాపారం చేసే వ్యాపారులు, మిల్లర్లతో ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తుందనీ, అదే సమయంలో అక్రమ వ్యాపార పద్ధతులతో ప్రజలపై భారం మోపే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.