

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : వీబీజీ రామ్‌జీ (ఉపాధి హామీ) పథకం అమలులో తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించింది. నవంబర్ 3న రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల మందికి పైగా కూలీలకు ఒకే రోజు ఉపాధి కల్పించింది. ఒకే రోజున ఇంతమందికి పని కల్పించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ఈ రికార్డును కొనసాగిస్తూ రానున్న రోజుల్లో మరిన్ని పనిదినాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనుల ద్వారా కూలీలకు పని కల్పించడంతోపాటు గ్రామాల్లో జల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టే పనులు, నీటి వనరుల అభివృద్ధి, గ్రామీణ మౌలిక సదుపాయాల బలోపేతానికి సంబంధించిన పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో స్థానిక అవసరాలకు అనుగుణంగా పనులను గుర్తించి, కూలీలకు నిరంతరం పని లభించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.