

ప్రభాత ఉదయం, జయశంకర్ భూపాలపల్లి : ఎన్డీఎస్ఏ సాకుతో మేడిగడ్డ బ్యారేజీని పడావు పెట్టి ప్రభుత్వం ఇసుక దందా చేస్తోందని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో కలిసి మంగళవారం ఆయన మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. గోదావరి నదిలోకి దిగి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం కావాలనే ప్రాజెక్టును పక్కనపెట్టిందని మండిపడ్డారు. రైతుల పంటలను ఎండబెడుతూ ఇబ్బందులు పెడుతున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
బ్యారేజీలో గేట్లు మూసి నీటిని నిల్వ చేస్తే ఇసుక తవ్వకాలకు అవకాశం ఉండదని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకే నీటిని నిల్వ చేయకుండా ఆంధ్రప్రదేశ్‌కు వదిలేస్తున్నారని ఆరోపించారు. బ్యారేజీ ఒడ్డునే కాకుండా పిల్లర్ల సమీపంలో కూడా భారీగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అక్రమ తవ్వకాల వల్ల బ్యారేజీ భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. మేడిగడ్డ ఇసుక దందాపై ప్రభుత్వం తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గణేష్ గుప్తా, పిట్టల రావు, బాల్ రెడ్డి, ముజీబ్, పుట్ట మధుకర్ తదితరులు పాల్గొన్నారు.