పట్నం దారిన పల్లె..

బతుకమ్మ, దసరా సెలవుల తర్వాత హైదరాబాద్‌కు తిరిగొస్తున్న ప్రజలతో ఎన్‌హెచ్‌-65పై రద్దీ పెరిగింది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులుతీరాయి.
పట్నం దారిన పల్లె..
Published on: 

ప్రభాత ఉదయం, చౌటుప్పల్‌:  బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వెళ్లిన ప్రజలు.. తిరిగి పట్నం బాట పట్టారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ తీవ్రంగా ఉన్నది. బుధ, గురువారాల్లో తిరుగుప్రయాణమైన ప్రజలతో ఎన్‌హెచ్-65పై వాహనాలు బారులుతీరాయి. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద గురువారం సాయంత్రం వాహనాలు భారీగా నిలిచిపోవడంతో టోల్‌ప్లాజా సిబ్బంది హైదరాబాద్ వైపు వెళ్లే 12 టోల్‌విండోలను తెరిచి వాహనాలను పంపించారు.  రద్దీ బాగాపెరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చౌటుప్పల్‌ పట్టణంలో ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో వాహనాలు నత్తను తలపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తమ గమ్యస్థానాలు చేరేందుకు ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చింది.

స్థానికులకు తప్పని అవస్థలు..

జాతీయ రహదారిపై వాహనాల రద్దీ స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించింది. ఆరెగూడెం, పంతంగి, అంకిరెడ్డిగూడెం, ధర్మాజీగూడెం, కైతాపురం, దండుమల్కాపురం, ఆందోల్‌ మైసమ్మ ప్రాంతాల్లో రోడ్డు దాటేందుకు ప్రజలు నానా అవస్థలు పడ్డారు. వాహనాలు వరుసగా వెళ్తుండటంతో రహదారిని దాటేందుకు అవకాశం లభించక కొన్నిచోట్ల 15 నిమిషాలకు పైగా నిరీక్షించాల్సి వచ్చింది. ముఖ్యంగా పాదచారులు, వృద్ధులు, మహిళలు, చిన్నారులు రోడ్డు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  

భద్రతా చర్యలు చేపట్టాలి

పండగల సమయంలోనే కాకుండా సాధారణ రోజుల్లోనూ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు అధికంగా ఉండటంతో గ్రామాల వద్ద రహదారి దాటడం ప్రజలకు సవాల్‌గా మారుతోంది. ఆయా ప్రాంతాల్లో పాదచారుల భద్రతకు తగిన ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు. రద్దీ సమయాల్లో ట్రాఫిక్‌ నియంత్రణను పటిష్టం చేయడంతోపాటు అవసరమైనచోట్ల క్రాసింగ్‌లు, హెచ్చరిక బోర్డులు, ఇతర భద్రతా చర్యలు చేపట్టాలని పాదచారులు విజ్ఞప్తి చేస్తున్నారు.