జడ్చర్లలో రాజకీయ రగడ

జడ్చర్లలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మధ్య మాటల యుద్ధం ముదిరింది. 2018 ఎన్నికల వ్యాఖ్యలతో పాటు ఆసుపత్రి నిర్మాణానికి రూ.25 కోట్ల డీడీ అంశంపై సవాళ్లు విసురుకున్నారు.
Laxma Reddy Anirudh Reddy War Of Words
లక్ష్మారెడ్డి, అనిరుధ్ రెడ్డి
Published on: 

ప్రభాత ఉదయం, జడ్చర్ల : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, జడ్చర్ల ఎంఎల్​ఏ అనిరుధ్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. 2018 ఎన్నికల సమయంలో మల్లు రవిని ఓడించాలని అనిరుధ్ రెడ్డి తనను కలిశాడని లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖలు చేయగా.. టికెట్​ రాలేదన్న ఒత్తిడిలో కలిశానని అనిరుధ్ రెడ్డి బదులివ్వడం ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. శనివారం జడ్చర్ల అంబేద్కర్ కళాభవన్​లో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. 2018 ఎన్నికల సమయంలో మల్లు రవిని ఓడించాలని అనిరుధ్ రెడ్డి తనను కలిశాడని తెలిపారు. ‘ఎంపీ మల్లు రవిని ఓడించాలని 2018 ఎన్నికల్లో నువ్వు నన్ను కలిసి చెప్పలేదా? టికెట్ రానంతమాత్రాన శంషాబాద్​లోని ఒక హోటల్లో నన్ను కలిసి మల్లురవిని ఓడించాలని చెప్పిన నిన్ను బ్రోకర్ అనాలా..? ఇంకేమనాలి?’ అని ఆయన ధ్వజమెత్తారు. దమ్ముంటే.. తహసీల్దార్ కార్యాలయ స్థలాన్ని, క్యాంపు కార్యాలయ స్థలాన్ని ఆసుపత్రి నిర్మాణానికి కేటాయిస్తున్నట్టు జీవో తీసుకురావాలని సవాల్ చేశారు. జీవో తెచ్చిన వెంటనే 25 కోట్ల రూపాయలను నువ్వు చెప్పిన విధంగానే డీడీ తీసి సీనియర్ సిటిజన్స్​కి అప్పజెప్తానని లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆసుపత్రి అందరికీ అందుబాటులో ఉందని, కావాలంటే ఆసుపత్రిని అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూసుకోవాలని, అవనరంగా ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని హితవుపలికారు. జడ్చర్లలో తన హయాంలోనే అభివృద్ధి జరిగిందని లక్ష్మారెడ్డి చెప్పారు. ‘ఇప్పటికిప్పుడు నువ్వు పదవికి రాజీనామా చెయ్​. ఇద్దరం కలిసి ఇండిపెండెంట్ గా పోటీ చేద్దాం. అప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దాం. నీ మీద నేను కూడా అవసరం లేదు. నా కార్యకర్తను నిలబెట్టి గెలిపిస్తా’అని లక్ష్మారెడ్డి సవాల్​ చేశారు.

డీడీ తీయకుంటే ఇల్లు ముట్టడిస్తం​..

మాజీ మంత్రి లక్ష్మారెడ్డి వ్యాఖ్యలపై ఎంఎల్​ఏ అనిరుధ్​ రెడ్డి స్పందించారు. మల్లు రవిని ఓడించాలని లక్ష్మారెడ్డిని కలిసిన మాట వాస్తవమేమనని ఒప్పుకొన్నారు. అయితే, టికెట్ రాలేదన్న ఒత్తిడిలో కలిశానని,ఆ విషయం మల్లు రవికి కూడా చెప్పానని తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. లక్ష్మారెడ్డి హయాంలో జడ్చర్లకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. రాజకీయ ఆరోపణలు పక్కనపెట్టి ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన 25 కోట్ల డీడీ తీయాలని లక్ష్మారెడ్డికి సవాల్​ చేశారు. ఆసుపత్రి నిర్మాణానికి ఆ డబ్బు కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రికి లేఖ రాసి.. ఆ డీడీ జిరాక్స్ కాపీని జతచేయాలని సూచించారు. అప్పుడు వెంటనే ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుందని చెప్పారు. ఆసుపత్రి నిర్మాణానికి భూమి అప్పజెప్పే బాధ్యత తాను తీసుకుంటానని ఆయన ప్రకటించారు. లక్ష్మారెడ్డి కేవలం మాటలకే పరిమితం కాకుండా, దమ్ముంటే ఆ రూ. 25 కోట్ల డీడీని తీసి చూపించాలని, ఒకవేళ 15 రోజుల్లో డీడీ తీయకపోతే 16వ రోజు ఆయన ఇంటిని ముట్టడిస్తామని అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు.  కాగా, ఇద్దరి నేతల సవాల్​, ప్రతిసవాళ్లు ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాతో పాటు జడ్చర్ల నియోజకవర్గ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.