వరంగల్‌లో ఫుడ్‌ సేఫ్టీ తనిఖీలు.. 9 కేంద్రాల లైసెన్సులు సస్పెండ్‌

వరంగల్ జిల్లాలో అపరిశుభ్ర వాతావరణం, నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. పలు యూనిట్లను మూసివేసి, 5 కేంద్రాలకు నోటీసులిచ్చారు.
TG SAFE officials inspecting food manufacturing units in Warangal
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆహార తయారీ కేంద్రాలను తనిఖీ చేస్తున్న టీజీ సేఫ్‌ అధికారులు.
Published on: 

ప్రభాత ఉదయం, హనుమకొండ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆహార తయారీ కేంద్రాలపై టీజీ సేఫ్‌ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనల ఉల్లంఘనలు, అపరిశుభ్ర వాతావరణం గుర్తించడంతో 9 కేంద్రాల లైసెన్సులను సస్పెండ్ చేశారు. పలు యూనిట్లను మూసివేశారు. మరో 5 కేంద్రాలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. కమిషనర్‌ అవినాష్‌ మహంతి ఆదేశాల మేరకు అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ జ్యోతిర్మయి పర్యవేక్షణలో 10 ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాయి.

 మిఠాయి, నూనె, మసాలాలు, అల్లం‌‌‌‌‌‌‌‌– వెల్లుల్లి పేస్ట్‌, సోంపు, ఐస్‌క్రీమ్‌ తయారీ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు కేంద్రాల్లో తీవ్రమైన అపరిశుభ్రతను అధికారులు గుర్తించారు.  స్వీట్ల తయారీలో ముఖానికి రాసుకునే రోజ్‌వాటర్‌ వినియోగిస్తున్నట్లు, చిప్స్‌ తయారీకి కుళ్లిన బంగాళాదుంపలు, బూజు పట్టిన అల్లం వాడుతున్నట్లు గుర్తించారు. గడువు ముగిసిన రూ.9,400 విలువైన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సోంపు తయారీ కేంద్రంలో సరైన లేబుల్స్‌, చిరునామా వివరాలు లేని 5,045 కిలోల ముడి సరుకును సీజ్‌ చేశారు. దీని విలువ రూ.5.41 లక్షలుగా అంచనా వేశారు. తుప్పుపట్టిన యంత్రాలు, అపరిశుభ్రమైన నీటి ట్యాంకులు, నూనె నిల్వ డబ్బాలు, పారిశుద్ధ్య లోపాలను గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సుమారు 80 కిలోల ప్యాకేజింగ్‌ మెటీరియల్‌ను ధ్వంసం చేశారు. ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. ఆహార తయారీదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ జ్యోతిర్మయి హెచ్చరించారు. తనిఖీల్లో వివిధ జిల్లాల ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.