

నల్గొండ, ప్రభాత ఉదయం ప్రతినిధి : ఉమ్మడి వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికకు ఓటరు నమోదు ప్రక్రియ స్పీడ్‌గా కొనసాగుతోంది. ఈ నియోజకవర్గంలోని 12 జిల్లాల పరిధిలో ఇప్పటివరకు సుమారు 4.21 లక్షల మంది అప్లై చేసుకున్నట్లు సమాచారం. వచ్చే నెల 6న ముసాయిదా ఓటర్ లిస్ట్ ప్రకటించనున్న నేపథ్యంలో అప్లికేషన్ల సంఖ్య ఐదు లక్షలకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, అప్లికేషన్ల పరిశీలనలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అక్టోబర్ 29 నాటికి వచ్చిన 4,21,395 అప్లికేషన్లలో 3,41,335(81శాతం) పెండింగ్‌లోనే ఉన్నాయి. మరోవైపు, ఓటరు నమోదులో రాజకీయ పార్టీలు కీలకంగా ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి ఓటరు నమోదు ప్రక్రియను స్పీడప్ చేయగా.. ఈ రేసులో బీఆర్‌ఎస్ వెనుకబడింది. బీజేపీ తరఫున స్పష్టమైన కార్యాచరణ కనిపించడం లేదు.
బీఎల్‌వోల వద్దే 2.40 లక్షల దరఖాస్తులు పెండింగ్
ఓటరు నమోదు అప్లికేషన్ల పరిష్కారంలో క్షేత్రస్థాయి పరిశీలనలో జాప్యం జరుగుతోంది. పెండింగ్ దరఖాస్తుల్లో 2,40,613 బూత్ లెవల్ అధికారుల(బీఎల్‌వోలు) వద్దే ఆగిపోయాయి. వీటితోపాటు అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ల (ఏఈఆర్వోలు) వద్ద 18,354, ఎలక్టో రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ల (ఈఆర్‌వోలు) వద్ద 51,230 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మరో 31,138 అప్లికేషన్లు ప్రాసెస్ చేయాల్సి ఉంది. దరఖాస్తుల పరిశీలన, అర్హతల నిర్ధారణ అనంతరం తదుపరి స్థాయికి పంపించే ప్రక్రియలో ఆలస్యం అవుతోంది.
ఆన్‌లైన్ అప్లికేషన్లకే మొగ్గు
ఓటరు నమోదులో ఆన్‌లైన్ విధానానికే ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లు మొగ్గుచూపుతున్నారు. మొత్తం 4,21,395 అప్లికేషన్లలో 4,20,900 ఆన్‌లైన్ ద్వారా రాగా, ఆఫ్‌లైన్‌లో 495 మాత్రమే వచ్చాయి. అంటే దాదాపు 99 శాతం దరఖాస్తులు ఆన్‌లైన్‌లోనే నమోదయ్యాయి. ఇప్పటివరకు 75,593 దరఖాస్తులు ఆమోదం పొందగా, 4,462 తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన దరఖాస్తుల పరిష్కారం స్పీడప్ కావాల్సి ఉంది. బీఎల్‌వోల స్థాయిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిశీలన పూర్తయితేనే తదుపరి ప్రక్రియ ముందుకు సాగనుంది.
ఓటర్ నమోదుపై పార్టీల ఫోకస్
గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదుపై రాజకీయ పార్టీలు ఫోకస్ చేశాయి. అధికార కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఓటర్ నమోదు చేయిస్తున్నారు. ముఖ్యంగా సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో అర్హులైన గ్రాడ్యుయేట్లను గుర్తించి ఓటరు జాబితాలో నమోదు చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక బీఆర్‌ఎస్ కూడా పట్టభద్రుల ఓటరు నమోదుపై దృష్టి సారించింది. అయితే క్షేత్రస్థాయిలో నమోదు ప్రక్రియ ఆశించిన స్థాయిలో వేగం పుంజుకోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జుల మధ్య సమన్వయ లోపం కూడా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, బీజేపీ నుంచి అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో ఆ పార్టీ తరఫున ఓటరు నమోదు ప్రారంభించలేదు.