

వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు మంచి పేరు సూచించమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. దీనికి స్పందనగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, ప్రజలు తమకు నచ్చిన పేర్లను సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రారంభ సమయంలో పేరు విషయంలో పెద్ద రగడ జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకోవడం సందర్భోచితంగా ఉంటుంది. అప్పటి అధికారం పక్షం కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచింది. విషయం రాష్ట్ర అసెంబ్లీ నుంచి పార్లమెంట్ వరకు వెళ్లింది. అసలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పేరు వెనుక ఉన్న ఆ కథేంటో తెలుసుకుందాం..
శంషాబాద్..రికార్డు స్థాయిలో 31 నెలల్లో నిర్మాణం
హైదరాబాద్‌లో ప్రయాణికుల రద్దీ పెరగడం, బేగంపేట విమానాశ్రయం భవిష్యత్ అవసరాలకు సరిపోకపోవడంతో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం ఏర్పడింది. తొలుత హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌ను సివిల్ ఎయిర్‌పోర్టుగా మార్చే ప్రతిపాదన వచ్చింది. అది సాధ్యం కాకపోవడంతో హైదరాబాద్‌కు దక్షిణం వైపు కొత్త విమానాశ్రయానికి స్థలాల పరిశీలన జరిగింది. చివరకు 1998లో శంషాబాద్‌ను కొత్త విమానాశ్రయానికి అనువైన ప్రాంతంగా ఎంపిక చేశారు. 2000 మే 29న కేంద్ర ప్రభుత్వం శంషాబాద్‌లో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి అనుమతి ఇచ్చింది.
2001 మే 31న GMR నేతృత్వంలోని కన్సార్టియం ప్రాజెక్టు అభివృద్ధికి ఎంపికైంది. 2003 సెప్టెంబర్ 30న భాగస్వామ్య సంస్థల మధ్య ఒప్పందాలు పూర్తికాగా, 2004 డిసెంబర్ 20న కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ మధ్య ఒప్పందం కుదిరింది. అనంతరం 2005 మార్చి 16న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శంషాబాద్ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. సుమారు 31 నెలల్లో నిర్మాణం పూర్తి కాగా, 2008, మార్చి 14న సోనియాగాంధీ ‘రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని’ ప్రారంభించారు. ఆ తర్వాత 2008, మార్చి 23 నుంచి వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి.
శంషాబాద్ కంటే ముందే బేగంపేట
శంషాబాద్ కంటే ముందే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచే కార్యకలాపాలు జరిగేవి. చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో 1936లో హైదరాబాద్ స్టేట్ ఏరో క్లబ్ బేగంపేటలో ప్రారంభమైంది. ప్లాటినం జూబ్లీ కాంప్లెక్స్ నిర్మాణంతో 1937 నుంచి వాణిజ్య విమాన సర్వీసులు మరింత విస్తరించాయి. 1972లో కొత్త టెర్మినల్ భవనం ప్రారంభించారు. ఇదే తర్వాతి దశలో ప్రధాన ప్యాసింజర్ టెర్మినల్‌గా మారింది. 1990ల నుంచి బేగంపేట అంతర్జాతీయ విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. బేగంపేట విమానాశ్రయంలో డొమెస్టిక్, ఇంటర్నేషనల్ రెండు టెర్మినళ్లు ఉండేవి. దేశీయ (డొమెస్టిక్) టెర్మినల్‌కు "ఎన్.టి.రామారావు టెర్మినల్" అని, అంతర్జాతీయ (ఇంటర్నేషనల్) టెర్మినల్‌కు "రాజీవ్ గాంధీ టెర్మినల్" అని పేరు పెట్టారు.
నిర్మాణం నుంచే రగడ..ఎన్టీఆర్ కోసం టీడీపీ పట్టు
శంషాబాద్‌లో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం మొదలైనప్పటి నుంచే దాని పేరుపై రాజకీయ రగడ మొదలైంది. 2005లో కేంద్రం కొత్త శంషాబాద్ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టాలని నిర్ణయించడంతో వివాదం మరింత ముదిరింది. పాత బేగంపేట విమానాశ్రయంలో ఇంటర్నేషనల్ టెర్మినల్‌కు రాజీవ్ గాంధీ, దేశీయ టెర్మినల్‌కు ఎన్టీ రామారావు పేరు ఉండేది. కొత్త విమానాశ్రయంలో కూడా ఇదే విధానం కొనసాగించాలని అప్పటి ప్రధానప్రతిపక్షం టీడీపీ కోరింది. ఈ డిమాండ్ ను వైఎస్ఆర్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తిరస్కరించింది. అప్పటి నుంచీ ఎన్టీఆర్ పేరు కోసం టీడీపీ డిమాండ్ చేస్తూనే వచ్చింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక అయిన ఎన్టీఆర్ పేరును నూతన ఎయిర్‌పోర్ట్‌లో పక్కన పెట్టడంపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇది ఎన్టీఆర్‌ను, తెలుగు ప్రజలను అవమానించడమేనని ఆరోపిస్తూ పార్లమెంట్ లోపల, బయటా నిరసనలు తెలిపింది. బేగంపేటలో ఉన్నట్లే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని గట్టిగా డిమాండ్ చేసింది.
రాజీవ్ గాంధీ పేరుకే కట్టుబడిన కేంద్రం
2005 మార్చి 15న లోక్‌సభలో టీడీపీ నేత కింజరాపు ఎర్రన్నాయుడు కొత్త విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. బేగంపేటలో అప్పటికే రాజీవ్‌గాంధీ, ఎన్టీఆర్ పేర్లతో టెర్మినళ్లు ఉన్నాయని, అదే విధానాన్ని నూతన విమానాశ్రయంలో కొనసాగించాలని కోరారు. అయితే అప్పటి కేంద్ర ప్రభుత్వం మాత్రం కొత్త శంషాబాద్ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. అప్పటి కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ, పాత విమానాశ్రయంలో ఎన్టీఆర్, రాజీవ్‌గాంధీ పేర్లు ఉన్న విషయాన్ని వివరిస్తూ.. కొత్తగా నిర్మిస్తున్న విమానాశ్రయానికి రాజీవ్‌గాంధీ పేరు పెట్టినట్లు సభకు తెలిపారు. వివాదం కొనసాగుతుండగానే 2008, మార్చి 14న సోనియాగాంధీ శంషాబాద్ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి శంషాబాద్‌లోని విమానాశ్రయాన్ని ‘రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)’గా వ్యవహ రిస్తున్నారు.
రాజీవ్ గాంధీ పేరుకే కట్టుబడిన కేంద్రం
2005 మార్చి 15న లోక్‌సభలో టీడీపీ నేత కింజరాపు ఎర్రన్నాయుడు కొత్త విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. బేగంపేటలో అప్పటికే రాజీవ్‌గాంధీ, ఎన్టీఆర్ పేర్లతో టెర్మినళ్లు ఉన్నాయని, అదే విధానాన్ని నూతన విమానాశ్రయంలో కొనసాగించాలని కోరారు. అయితే అప్పటి కేంద్ర ప్రభుత్వం మాత్రం కొత్త శంషాబాద్ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. అప్పటి కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ, పాత విమానాశ్రయంలో ఎన్టీఆర్, రాజీవ్‌గాంధీ పేర్లు ఉన్న విషయాన్ని వివరిస్తూ.. కొత్తగా నిర్మిస్తున్న విమానాశ్రయానికి రాజీవ్‌గాంధీ పేరు పెట్టినట్లు సభకు తెలిపారు. వివాదం కొనసాగుతుండగానే 2008, మార్చి 14న సోనియాగాంధీ శంషాబాద్ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి శంషాబాద్‌లోని విమానాశ్రయాన్ని ‘రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)’గా వ్యవహ రిస్తున్నారు.
ఎన్టీఆర్ పేరుకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ తీర్మానం
శంషాబాద్ పేరు వివాదం అంతటితో సమసిపోలేదు. మరో కొత్త వివాదం మొదలైంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ (ఇప్పటి బీఆర్ఎస్) ప్రభుత్వం, కాంగ్రెస్ సహా పలు పార్టీలు షాబాద్ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్‌కు ఎన్.టి.రామారావు టెర్మినల్‌గా పేరు పెట్టే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడినందున, ఇక్కడి విమానాశ్రయాలకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాయకుల పేర్లు పెట్టడం ఏంటని అప్పటి అధికార టీఆర్ఎస్ ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కేంద్రం నిర్ణయం తీసుకుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించి యథాతథ స్థితి కొనసాగించాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ 2014 నవంబర్ 21న తీర్మానం కూడా చేసింది. 2014 నవంబర్‌లో రాజ్యసభలోనూ ఈ అంశంపై చర్చ జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పునరుద్ధరిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ (అశోక్ గజపతి రాజు) జారీ చేసిన ఉత్తర్వులపై కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో విపరీతమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి, కేంద్ర ప్రభుత్వానికి, ఎన్డీయేకు వ్యతిరేకంగా తీవ్ర నినాదాలు చేశారు. దీంతో రాజ్యసభ కనీసం నాలుగు సార్లు వాయిదా పడింది.
కొనసాగుతున్న రాజీవ్ పేరు.. మాయమవ్వని ఎన్టీఆర్ పేరు
2014లో శంషాబాద్ దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టినా.. శంషాబాద్ విమానాశ్రయం అధికారిక పేరు మాత్రం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)గానే కొనసాగుతోంది. ప్రస్తుతం ఒకే ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ఉన్న నేపథ్యంలో, అధికారిక RGIA వెబ్సైట్లోనూ ‘Rajiv Gandhi International Airport’ పేరే కనిపిస్తోంది.” ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఎన్టీఆర్ పేరు పూర్తిగా మాయమవ్వలేదు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ప్రస్తుత రికార్డుల్లో బేగంపేటలోని ఎన్టీఆర్ టెర్మినల్ పేరు ఇప్పటికీ ఉంది. 2026లోనూ AAI టెండర్ పత్రాల్లో “RGT and NTR Terminal Buildings at Begumpet Airport” అని పేర్కొంది.
మామునూరుకు మళ్లీ రెక్కలు
వరంగల్ సమీపంలోని మామునూరు విమానాశ్రయం 1930లో నిజాం ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో నిర్మించబడింది. అప్పట్లో ఇది దేశంలోని పెద్ద విమానాశ్రయాల్లో ఒకటిగా ఉండేది. సుమారు 1,875 ఎకరాల విస్తీర్ణం, 6.6 కి.మీ. రన్‌వే, పైలట్ శిక్షణ కేంద్రం, సిబ్బంది నివాసాలు, ఒకటికి మించిన టెర్మినళ్లు ఉండేవి. వరంగల్‌లోని ఆజంజాహీ మిల్స్, కాగజ్‌నగర్ పేపర్ పరిశ్రమ వంటి పారిశ్రామిక అవసరాలతోపాటు ప్రముఖుల రాకపోకలకు ఇది ఉపయోగపడేది. రెండో ప్రపంచ యుద్ధం, 1962 భారత-చైనా యుద్ధ సమయాల్లో సైనిక అవసరాలకు ఉపయోగపడటంతోపాటు 1980ల వరకు 'వాయుదూత్' ప్యాసింజర్, కార్గో సర్వీసులను అందించింది. అయితే ప్రయాణికుల రద్దీ తగ్గడం, ఆర్థికంగా లాభదాయకం కాకపోవడంతో 1981లో దీని నుంచి వాణిజ్య విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో అప్పటి నుంచి మామునూరు విమానాశ్రయాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్ వస్తూనే ఉంది.
ఈ నేపథ్యంలో మామునూరు పునరుద్ధరణకు గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. 2007 మార్చి 30న AAI మామునూరు, కడప విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు అవగాహన ఒప్పందం చేసుకుంది. అయితే ఆ ప్రణాళిక ముందుకు సాగలేదు. తర్వాత 2023 జూలై 31న తెలంగాణ కేబినెట్ మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి ఆమోదం తెలిపింది. అదనంగా 253 ఎకరాల భూమి సమీకరించేందుకు 2024 నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 205 కోట్లు కేటాయించింది. 2026 సెప్టెంబర్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రెండు వారాల్లో టెండర్లు పిలిచి, డిసెంబర్లో ఖరారు చేసి అదే నెలలో పనులకు శంకుస్థాపన చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డికి తెలిపినట్లు తెలంగాణ ప్రభుత్వ అధికారిక ప్రకటన పేర్కొంది.
భద్రకాళి అమ్మవారు, పీవీ.. జయశంకర్.. తెరపైకి ఎన్నో పేర్లు!
మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు పేరు సూచించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన విజ్ఞప్తికి విశేష స్పందన లభిస్తోంది. వరంగల్ చరిత్ర, కాకతీయుల వైభవం, తెలంగాణ ఉద్యమం, సామాజిక పోరాటాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకలుగా నిలిచిన పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. కాకతీయ సామ్రాజ్యాధిపతి రాణి రుద్రమదేవి, కాకతీయ సేనాని రేచర్ల రుద్రారెడ్డి, కాకతీయ సామ్రాజ్యాన్ని ప్రతిబింబించే ‘కాకతీయ’, వరంగల్ నగర ఆరాధ్య దైవం భద్రకాళి అమ్మవారు, ఆదివాసీ వీరనారులు సమ్మక్క-సారలమ్మ, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ, హజారే మంగమ్మ, కాకతీయ సేనాని గోన గన్నారెడ్డి, ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప దేవాలయం, స్వాతంత్ర్య సమరయోధుడు మౌల్వీ సయ్యద్ అల్లావుద్దీన్ తదితరుల పేర్లను పలువురు సూచిస్తున్నారు.