

కరీంనగర్ బ్యూరో, ప్రభాత ఉదయం: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని ఆయకట్టుకు ఎస్పారెస్పీ నుంచి కాకతీయ ప్రధాన కాలువకు శనివారం నీటిని విడుదల చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల పరిధిలో చివరి దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు సుమారు 4వేల క్యూసెక్కులు విడుదల చేశారు. ఎల్‌నినో ఎఫెక్ట్‌తో ఈ సీజన్లో సరైన వర్షాల్లేక ఎస్పారెస్పీకి వరద రాలేదు. దీంతో ప్రాజెక్ట్ నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేయలేదు. బోర్లలో నీరు లేకపోవడంతోపాటు అప్రకటిత కరెంట్ కోతలతో చివరి దశలో ఉన్న వరి పైర్లు ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ ఇటీవల ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ఎస్సారెస్పీ నుంచి ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని కోరారు. ఆయన ఆదేశాల మేరకు శనివారం కాకతీయ ప్రధాన కాలువకు 4 వేల క్యూసెక్కులు విడుదల చేశారు. ఈ నీరు తొమ్మిది రోజుల పాటు సరఫరా కానుంది. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 45.459 టీఎంసీలు(పూర్తిస్థాయి సామర్థ్యం 80.5 టీఎంసీలు) ఉన్నాయి. ఆదివారం సాయంత్రానికి పెద్దపల్లి, మంథని, రామగుండం, చొప్పదండి నియోజకవర్గాలకు ఈనీరు అందనున్నది. సాగునీటి విడుదలతో ఉమ్మడి జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేశారు.
ఎల్ఎండీ నుంచి నీటి విడుదలకు డిమాండ్
ఎల్ఎండీ ఎగువ ప్రాంతానికే నీటిని విడుదల చేస్తుండడంతో దిగువన ఉన్న ప్రాంతాల్లోని ఆయకట్టుకు కూడా విడుదల చేయాలని రైతుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. మానకొండూర్, శంకరపట్నం, వీణవంక, జమ్మికుంట, హుజూరాబాద్, హనుమకొండ జిల్లా కమలాపూర్, ఎల్కతుర్తి మండలాల్లో వరి పైర్లు ఎండిపోతున్నాయని సాగునీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.