నెట్టేస్తారు.. కొట్టేస్తారు.. జర పైలం!

Pickpocketing in Hyderabad
Women Pickpocketing Gangs In Hyderabad
Published on: 
  • మహానగరంలో మాయలేడీల హల్‌చల్

  • రైళ్లు, మెట్రోలు, బస్సులు, షాపింగ్ మాల్స్‌లో మాటు

  • హడావుడి నటిస్తూ చేతివాటం

  • పలు ముఠాల ఆటకట్టించిన పోలీసులు

ప్రభాత ఉదయం, హైదరాబాద్‌ : జర పైలం! మహా నగరంలో మాయలేడీలు హల్‌చల్ చేస్తున్నారు. అందరిలో కలిసిపోయి.. బస్సులు, రైలు బోగీల్లోకి ఎక్కే ప్రయాణికులను నెట్టేసి నగలు, పర్సులు, బ్యాగులను కొట్టేస్తున్నారు. మహిళలు, వృద్ధులే లక్ష్యంగా వరుస దొంగతనాలు, మోసాలకు పాల్పడుతున్న ముఠాల సభ్యులను హైదరాబాద్  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూకట్‌పల్లి పరిధిలో మహిళల నుంచి నగదు, బంగారు ఆభరణాలను అపహరిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు చెమటోడ్చి పట్టుకున్నారు. ధూల్‌పేట్, బేగంబజార్, సరూర్ నగర్ సహా పలు ప్రాంతాల్లో వృద్ధుల దృష్టిని మరల్చి మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టయింది. దీనిలోని ఇద్దరు కిలేడీలను మంగళ్‌హాట్ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు.

బస్సులు, రైళ్లలో చేతివాటం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, రాజస్థాన్, హరియాణా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన కొందరు మహిళలు ముఠాలుగా ఏర్పడుతున్నారు. రద్దీ సమయాల్లో హైదరాబాద్​లోని రైతుబజార్లు, వార సంతలు, షాపింగ్‌మాల్స్​, సిటీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్, సాధారణ రైళ్లను ఈ ముఠాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయి. వీటిలోని కిలేడీలు సిటీ బస్సులు, రైలు బోగీల్లోని మహిళల మధ్య ప్రయాణికులుగా కలిసిపోతున్నారు. అందరూ ప్రయాణ హడావుడిలో ఉండగా చేతివాటాన్ని ప్రదర్శించి పర్సులు, నగలు, ఫోన్లు, నగదు, విలువైన వస్తువులను కొట్టేస్తున్నారు. ఆ వెంటనే అక్కడి నుంచి మాయమైపోతున్నారు.

టార్గెట్ : బ్యాంకుల నుంచి ఫంక్షన్ హాళ్ల దాకా ​

·       బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు, పోస్టాఫీసుల వద్ద వయోధికులను మాయలేడీలు అటకాయిస్తున్నారు. బెదిరించి వారి వద్దనున్న సంచులను లాక్కొని పారిపోతున్నారు.

·       మధ్యప్రదేశ్‌కు చెందిన దొంగల ముఠా సభ్యులు తాము వధూవరుల తరఫు బంధువులం అంటూ పెళ్లిళ్లు, శుభకార్యాలకు వస్తున్నారు. ఫంక్షన్‌హాళ్లలో వధూవరులకు కేటాయించిన గదుల్లోకి చొరబడి నగలు, విలువైన వస్తువులతో ఉడాయిస్తున్నారు.

·       హైదరాబాద్​ నగరానికి చెందిన కొందరు మహిళలు ముసుగులు ధరించి నగలు, చీరలు దొంగతనం చేస్తున్నారు. దీనిపై ఇటీవలే 5 కేసులు నమోదయ్యాయి.

·       తవ్వకాల్లో తమకు దొరికిన పాత బంగారాన్ని తక్కువ రేటుకే ఇస్తామని, విదేశాల నుంచి తెప్పించిన పసిడి బిస్కెట్లను చౌకగా ఇచ్చేస్తామంటూ ఇంకొన్ని ముఠాలు మోసాలకు పాల్పడుతున్నాయి.

·       ఢిల్లీ, గుజరాత్‌లకు చెందిన మరో మహిళల ముఠా తమ దగ్గర విదేశీ నగదు ఉందంటూ తెల్లకాగితాలను చేతికిచ్చి మోసగిస్తోంది.