

ప్రభాత ఉదయం, యాదాద్రి ప్రతినిధి: యాదాద్రి జిల్లాలో సీఎంఆర్ మిల్లుల్లో సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ వరుస తనిఖీలు నిర్వహిస్తున్నది. తాజాగా రైస్ మిల్లుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడి మిల్లుపై నిర్వహించిన దాడిలో సీఎంఆర్‌లో భారీ స్థాయిలో వడ్లు మాయమైనట్లు గుర్తించింది.
జిల్లా అధికారుల దాడి
యాదాద్రి జిల్లాలో గడిచిన వానాకాలం 2025- 26 సీజన్‌కు సంబంధించి 52 మిల్లులకు 3.02 లక్షల టన్నులు కేటాయించారు. ఇందులో రైస్ మిల్లుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంప నాగేందర్‌కు చెందిన ‘శివ పారా బాయిల్డ్ రైస్‌మిల్లు’కు 12,739 టన్నులు కేటాయించారు. ఈ మిల్లు నుంచి సీఎంఆర్ సరిగా రాకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశం మేరకు జిల్లా సివిల్ సప్లయ్ అధికారి రోజారాణి, జిల్లా మేనేజర్ హరికృష్ణ ఆధ్వర్యంలో బుధవారం, గురువారం సివిల్ సప్లయ్ అధికారులు సోదాలు చేశారు. మిల్లుతో పాటు మోటకొండూరు, ముత్తిరెడ్డి గూడెం, భువనగిరిలోని గోడౌన్లలోని తనిఖీలు చేయగా రూ.18 కోట్ల విలువైన 6,302 టన్నుల వడ్లు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో మిల్లు యజమాని నాగేందర్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కాగా ఇదే మిల్లుకు యాసంగి 2026 సీజన్లో 20,257 టన్నులు, జిల్లాలోని బీబీనగర్‌లో ఈయనకే చెందిన కాదంబరీ రైస్‌మిల్లుకు వానాకాలం 2025- 26 సీజన్‌కు సంబంధించి 14,404 టన్నులు, యాసంగిలో 13,337 టన్నుల వడ్లు కేటాయించారు.
రూ.73 కోట్ల విలువైన వడ్లు మాయం
గడిచిన మూడు నెలల్లో జిల్లాలోని మూడు మిల్లులపై నిర్వహించిన దాడుల్లో మొత్తంగా రూ.73 కోట్ల విలువైన వడ్లు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. భువనగిరి మండలం అనంతారంలోని యాదాద్రి రైస్‌మిల్లులో రూ.22 కోట్ల విలువైన వడ్లు పక్కదారి పట్టించారని తేలింది. రామన్నపేట మండలం ఇంద్రపాల నగరంలోని విద్య మిల్లులో రూ.33 కోట్ల విలువైన వడ్లు, తాజాగా రాయగిరిలో శివ రైస్‌మిల్లులో రూ.18 కోట్ల విలువైన వడ్లు మాయం చేశారు.