యాదగిరీశుడికి 'లక్షపుష్పార్చన'!

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఏకాదశి సందర్భంగా లక్షపుష్పార్చన నిర్వహించారు. 44 రోజుల్లో హుండీల ద్వారా రూ.2.60 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఈవో వెల్లడించారు.
యాదగిరీశుడికి 'లక్షపుష్పార్చన'!
Published on: 

ప్రభాత ఉదయం, యాదగిరిగుట్ట : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం ఏకాదశిని పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి అర్చకులు లక్షపుష్పార్చన కైంకర్యాన్ని వైభవంగా చేపట్టారు. సుప్రభాత సేవ, తిరుప్పావై, ఆరాధనల అనంతరం ప్రధానాలయ ముఖమండపంలో ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, స్వర్ణాభరణాలు, వజ్ర వైఢూర్యాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేసి భక్తుల సర్వతోముఖాభివృద్ధిని ఆకాంక్షిస్తూ సంకల్పం చేశారు. వేదపండితుల మంత్రోచ్చారణలు, వేదఘోషతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు, అర్చక బృందం, వేదపండితులు, ఉన్నతాధికారులు, భక్తులు పాల్గొన్నారు.

44 రోజుల్లో రూ.2.60 కోట్ల ఆదాయం

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం హుండీ కానుకలను అధికారులు గురువారం లెక్కించారు. గత 44 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.2,60,59,278 నగదు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో భవానీ శంకర్‌ వెల్లడించారు. వీటితో పాటు 65 గ్రాముల బంగారం, 2.650 కిలోల వెండి సమకూరినట్లు తెలిపారు. విదేశీ కరెన్సీ కూడా హుండీల్లో లభించినట్లు పేర్కొన్నారు.