

యాదగిరిగుట్ట, ప్రభాత ఉదయం : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి నిత్య కైంకర్యాల సమయాల్లో మార్పులు చేసినట్లు ఆలయ కార్య నిర్వహణాధికారి భవానీ శంకర్ శుక్రవారం తెలిపారు. ఈ నెల 8న ఆదివారం దీపావళి పండుగ సందర్భంగా ఆలయంలో సుప్రభాత సేవ టికెట్లు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 3:30 నుంచి4 గంటల వరకు సుప్రభాతం, ఉదయం 4 నుంచి 4:45 గంటల వరకు స్వామివారికి ఆస్థాన మంగళ హారతులు, ఉదయం 4:45 నుంచి 5:45 గంటల వరకు స్వామివారికి తిరువారాధన, బాలభోగము, ఆరగింపు, ఉదయం 5:45 నుంచి 6:45 గంటల వరకు నిజాభిషేకం, ఉదయం 6:45 నుంచి 7:15 గంటల వరకు సహస్రనామార్చన, ఉదయం 7:15 గంటల నుంచి ఉభయ దర్శనాలు, నిత్యకల్యాణం తదితర ఆలయ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మార్పులు ఆదివారం ఒక్కరోజుకే వర్తిస్తాయని, భక్తులు సహకరించాలని కోరారు. సోమవారం నుంచి పూజలు యథాతథంగా ఉంటాయన్నారు.