తీర్మానాలు ఘనం.. పనులు శూన్యం! యాదగిరిగుట్ట బోర్డుపై భక్తుల గుర్రు

తిరుమల తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానాన్ని తీర్చిదిద్దుతామని ప్రగల్భాలు పలికిన పాలకమండలి తీరు మాటలు కోటలు దాటుతున్నా చేతలు మాత్రం గడప దాటడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Yadagirigutta temple
Yadagirigutta temple development works delay
Published on: 

ప్రభాత ఉదయం, యాదగిరిగుట్ట: తిరుమల తరహాలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానాన్ని తీర్చిదిద్దుతామని ప్రగల్భాలు పలికిన పాలకమండలి తీరు మాటలు కోటలు దాటుతున్నా చేతలు మాత్రం గడప దాటడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా నియమించిన వైటీడీ ట్రస్ట్ బోర్డు ఏర్పాటై దాదాపు మూడు నెలలు గడుస్తున్నా, కొండపై భక్తుల కష్టాలు తీరకపోగా.. ఒక్క అభివృద్ధి పనికి పునాది రాయి పడకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు.

కాగితాలకే పరిమితమైన తీర్మానాలు

గతేడాది జూలై 11న ప్రముఖ పారిశ్రామికవేత్త బి. సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన 18 మందితో కూడిన వైటీడీ ట్రస్ట్‌ బోర్డు బాధ్యతలు స్వీకరించింది. దీంతో క్షేత్రస్థాయిలో మార్పులు వస్తాయని భక్తులు ఆశించారు. ఆగస్టు 14న జరిగిన రెండో సమావేశంలో పాలకమండలి పలు భారీ ప్రాజెక్టులను ప్రకటించింది. రూ.43.12 కోట్లతో అత్యాధునిక దీక్షాపరుల మండపం, రూ.13.03 కోట్లతో నూతన కల్యాణ మండపం, కొండపైకి వెళ్లే మార్గంలో భారీ స్వాగత తోరణం, 40 ఎకరాల్లో మోడల్‌ గోశాల, వేద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులను ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా చైర్మన్‌, సభ్యులే తమ సొంత నిధులతో నిర్మిస్తారని ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయాలు తీసుకుని రెండు నెలలు గడుస్తున్నా.. కనీసం భూమిపూజ కూడా జరగకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అధికారులకూ దొరకని సభ్యులు.!

సమావేశాలు, పత్రికా ప్రకటనలకే ట్రస్ట్‌ బోర్డు సభ్యులు పరిమితమవుతున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. తమ సమస్యలను చెప్పుకునేందుకు సభ్యుల్లో ఏ ఒక్కరూ అందుబాటులో ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పాలనా యంత్రాంగం వద్ద కూడా బోర్డు సభ్యుల వ్యక్తిగత ఫోన్‌ నంబర్లు లేకపోవడం గమనార్హం. సమస్యల పరిష్కారం కోసం సభ్యులను సంప్రదించాలంటే పీఆర్వోల నంబర్లపైనే ఆధారపడాల్సి వస్తోందని, ఈ పరిస్థితిపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

మూడో భేటీపైనే ఆశలు..

యాదగిరిగుట్టలోని ప్రెసిడెన్షియల్‌ సూట్‌లో మంగళవారం ట్రస్ట్‌ బోర్డు మూడో సమావేశం జరగనుంది. దీంతో భక్తుల దృష్టి ఈ భేటీపైనే ఉంది. సమావేశం నిర్వహించి పత్రికా ప్రకటనలకే పరిమితమవుతారా? గతంలో ప్రకటించిన అభివృద్ధి పనులకు సంబంధించి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక, ప్రారంభ తేదీలను వెల్లడిస్తారా? అని భక్తులు ఎదురుచూస్తున్నారు. ఈ అంశాలపై ఆలయ కార్యనిర్వహణ అధికారి భవానీ శంకర్‌ మాట్లాడుతూ.. ‘‘రెండో సమావేశంలో ప్రకటించిన పనులకు సంబంధించి ప్రస్తుతం సైట్‌ ప్లాన్‌లు, డిజైన్లు, సాయిల్‌, రాక్‌ టెస్టుల పరిశీలన జరుగుతోంది. విష్ణుపుష్కరిణి వద్ద సోలార్‌ పనులు, నూతన కల్యాణకట్ట నిర్మాణ బాధ్యతలను దాతలకు అప్పగించాం. స్ట్రక్చరల్‌ పనులు పూర్తయిన వెంటనే నిర్మాణాలు ప్రారంభిస్తాం. మూడో సమావేశంలో అన్ని అభివృద్ధి పనులపై పూర్తి స్పష్టత ఇస్తాం’’ అని తెలిపారు.